అదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీని ఓడించాలి.. బీఎస్పీ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం
బహుజన ఉద్యమ బలోపేతంతోనే సామాజిక న్యాయం సాధ్యం: నిషాని రామచంద్రం
మన భారత్, ఆదిలాబాద్:
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఎస్పీ జోన్ చీఫ్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు.
అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తుడిచెర్ల సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశానికి నిషాని రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బహుజన్ ఉద్యమ నేత కాన్షీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల పార్టీ కమిటీల పనితీరుతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కమిటీలపై సమీక్ష నిర్వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీ వరకు బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు.
ఈ సందర్భంగా నిషాని రామచంద్రం మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. బహుజన సమాజం ఐక్యంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం ద్వారా హక్కులు, అవకాశాలు పొందుతున్న బహుజన వర్గాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. దళితులు, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని నిషాని రామచంద్రం అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం సాధించాలంటే బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన కోరారు.
సమావేశంలో బీఎస్పీ జోన్ ఇంచార్జ్ కల్లెపెల్లి రాజేందర్, పార్లమెంట్ ఇంచార్జ్ తుడిచెర్ల సంజయ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు రాజ్యం, కార్యవర్గ సభ్యుడు కాటం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెరుకు రాజ్యం ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గానికి చెందిన వాగ్మారే విలాస్ తన అనుచరులతో కలిసి బీఎస్పీలో చేరారు. నిషాని రామచంద్రం పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
