మన భారత్, తెలంగాణ:
ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క–సారలమ్మలు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు.
కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు ప్రతి జాతర సమయంలో కోట్లాదిగా భక్తులు మేడారానికి తరలివస్తారని కేసీఆర్ తెలిపారు. ఈ మహాజాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుండటం తెలంగాణకు గర్వకారణమని అన్నారు.

తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి, సంప్రదాయాలకు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపీట వేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. గోదావరి లోయ పరీవాహక ప్రగతితో పాటు రాష్ట్రంలో ఆధ్యాత్మిక అభివృద్ధి సమాంతరంగా సాగిందని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించేలా సమ్మక్క–సారలమ్మ దేవతలు దీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
