మన భారత్, ఆదిలాబాద్:
అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ లేకుండా ఇతర వర్గాల వారు లేదా వ్యక్తులు ఇష్టారీతిన తమ వాహనాలపై ‘PRESS’ అని రాసుకోవడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు మోటార్ వాహన చట్టం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అధికారిక గుర్తింపు లేకుండా ‘PRESS’ స్టిక్కర్ వినియోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే భద్రతా పరంగా సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు.
కాబట్టి జిల్లాలోని జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని, అక్రెడిటేషన్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘PRESS’ స్టిక్కర్ వాడకూడదని DPRO విష్ణువర్ధన్ సూచించారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటాయని ఆయన హెచ్చరించారు.
