మన భారత్, ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రానికి ఏర్పడిన బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని మించిన రాష్ట్రం మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారు.
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో భాగంగా నిర్వహించిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా సముద్రతీరం, అనేక పోర్టులు, ఆధునిక ఎయిర్‌పోర్టులు ఏపీకి ప్రధాన బలమని పేర్కొన్నారు. ఈ భౌగోళిక ప్రయోజనాలు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా మారాయని తెలిపారు.
అలాగే, 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఆయన వివరించారు.
దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ, విదేశీ పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
