e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

పేదరికం, నిరక్షరాస్యతే అసలు శత్రువులు: సీఎం

  • జడ్చర్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి భూమి పూజ

మన భారత్, మహబూబ్‌నగర్:

“నాకెవరు వ్యక్తిగత శత్రువులు లేరు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తాం.. ఎన్నికల తర్వాత ప్రజల కోసం అందరం కలిసి పని చేయడమే నా విధానం” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదరికం, నిరక్షరాస్యత మాత్రమే రాష్ట్రానికి అసలు శత్రువులని ఆయన పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి, పలు కీలక అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ (IIIT) నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు, మహబూబ్‌నగర్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ వీర్లపల్లి శంకర్, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.

విద్య, సాగునీటికే ప్రాధాన్యత

బూర్గుల రామకృష్ణారావు తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సీఎం పదవి దక్కడం గర్వకారణమని రేవంత్ రెడ్డి తెలిపారు. తొలి ప్రధాని నెహ్రూ విద్య, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పటికీ ప్రజలకు జీవనాధారమని చెప్పారు. తాను కూడా అదే దిశగా సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థల అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం వద్ద భూమి లేదు

గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేవని, పీవీ నరసింహరావు ప్రభుత్వం భూగరిష్ఠ పరిమితి చట్టం తీసుకొచ్చి మిగులు భూములను పేదలకు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పేదలకు భూమి పంచేందుకు కూడా ప్రభుత్వం వద్ద భూమి లేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా భూమి కొరత ఉందని స్పష్టం చేశారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులు

మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.1,284 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా పాలమూరు బిడ్డల శ్రమ ఉందని, వలస వెళ్లి తట్ట పని, మట్టి పని చేసిన వారు పాలమూరు ప్రజలేనని అన్నారు. జిల్లాలోని గట్టు మండలం దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు

కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేదని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 2013లో కాంగ్రెస్ నేతలు సాధించారని, ప్రాజెక్టు పేరుతో రూ.23 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినా పూర్తి చేయలేదని అన్నారు. ఉద్ధండాపూర్ జలాశయం భూనిర్వాసితులకు నిధులు ఇవ్వలేదని, సంగంబండ వద్ద పనులకు పదేళ్లలో రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

ఎన్నికల తర్వాత శత్రుత్వం లేదు

ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు తెచ్చేందుకే ప్రధాని మోదీని కలుస్తున్నానని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత వ్యక్తిగత శత్రుత్వాలకు చోటు లేదన్నారు. తనకు ఎవరూ శత్రువులు కాదని, ప్రజల జీవితాలను మార్చే పనులే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

మూడేళ్లకే కూలిన ప్రాజెక్టు

నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన చివరి జీవో అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పదేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని విమర్శించారు.

గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని చెప్పారు. 3.50 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆర్థిక స్వావలంబనకు అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE