మన భారత్ ,తెలంగాణ:
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయిందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. రైతులకు వాస్తవంగా ఉపయోగపడేలా సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే సదర్మాట్ బ్యారేజీని పూర్తి చేసి రైతులకు అంకితం చేసిందని జూపల్లి తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రైతుల నష్టపరిహారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసి రైతులకు న్యాయం చేశారని చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, సాగునీరు, పరిహారం, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి రాజీ లేదని మంత్రి స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి భరోసా కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
