సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి
మన భారత్, తెలంగాణ:
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. 2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) ప్రకారం టికెట్ ధరపై గరిష్టంగా 1.5 రెట్లు వరకు ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం మేరకు ప్రస్తుతం రూ.100గా ఉన్న టికెట్ ధర రూ.150కు పెరగనుంది. అయితే ఈ పెంపు సాధారణ బస్సులకు కాకుండా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ముందస్తు ప్రయాణ రద్దీ దృష్ట్యా, అలాగే తిరుగు ప్రయాణాలు అధికంగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ వివరించింది. ప్రయాణికులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని, ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, భద్రతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
