మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అలర్ట్
మన భారత్, తెలంగాణ:
మరో వారం నుంచి పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అప్రమత్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
గత నాలుగు–ఐదు రోజులుగా తమను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ కీలక సూచనలు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశాల నేపథ్యంలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
నగరాలు, పట్టణాల్లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని సీఎం సూచించారు. అదే సమయంలో మంత్రులు కూడా ఎమ్మెల్యేలు, పార్టీ నేతల నుంచి వస్తున్న సమస్యలపై వెంటనే స్పందించి అవసరమైన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.

మెజార్టీ వార్డులే లక్ష్యం..
మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని, చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించారు.
డివిజన్లు, వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, నల్లా నీళ్ల సమస్యలు వంటి నిత్యజీవితానికి సంబంధించిన అంశాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తమ పరిధిలోని పట్టణాలపై ఈ వారం నుంచి పది రోజుల పాటు ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతంగా పర్యటించాలని, ప్రజల ఇబ్బందులను నేరుగా తెలుసుకోవాలని సూచించారు.
ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను కాంగ్రెస్ దక్కించుకునేలా పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై చురుకుగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతల రాజకీయ భవిష్యత్తు కూడా నిర్ణయమవుతుందన్న పరోక్ష సంకేతాలను నాయకత్వం ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
