అంతర్రాష్ట్ర జల వివాదాలు తేలేవరకు గోదావరి జలాల తరలింపుకు అనుమతులివ్వొద్దు – శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
మన భారత్, తెలంగాణ:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పూర్తిగా పరిష్కారమయ్యే వరకు గోదావరి జలాలను ఏ రూపంలోనైనా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం – నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లేదా భవిష్యత్తులో చేపట్టే ఇతర ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాల మళ్లింపును అనుమతించవద్దని కేంద్రాన్ని ఈ తీర్మానం ద్వారా స్పష్టంగా కోరింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులు, రాష్ట్ర విభజన అనంతరం తలెత్తిన జల వివాదాలు, గత ప్రభుత్వాల నిర్ణయాలు, జరిగిన తప్పిదాలు, ప్రాజెక్టుల చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా సభ ముందుంచారు.
చర్చకు ముందుగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్వాపరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం గోదావరి జలాల తరలింపుకు సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్రం అనుమతులు ఇవ్వకూడదని కోరుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణలో అత్యంత కరవు ప్రభావిత ప్రాంతంగా ఉండటంతో పాటు, వలసలు అధికంగా జరిగిన ప్రాంతమని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే అప్పటి ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో సరైన పురోగతి సాధించకపోవడం వల్ల అంచనాలు, నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తాగునీటి, సాగునీటి అవసరాల కోసం 90 టీఎంసీల సామర్థ్యంతో రూపొందించిన పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ తన తీర్మానం ద్వారా కోరింది.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యకైనా తాము వ్యతిరేకమని శాసనసభ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
