అసెంబ్లీని బూతులమయం..
మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని, స్పీకర్ వ్యవహారం పూర్తిగా పక్షపాతంగా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వ్యాఖ్యలతో అసెంబ్లీ స్థాయి దిగజారిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్ వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, “సీఎం వీధి రౌడీ కంటే కూడా చిల్లరగా మాట్లాడారు. అసెంబ్లీని బూతులమయం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై స్పీకర్ ఒక్క మాట కూడా అభ్యంతరం చెప్పడం లేదు” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
“సీఎంను విమర్శించొద్దంటే మేమెందుకు అసెంబ్లీకి రావాలి? ప్రజల తరఫున ప్రశ్నలు అడగడం మా బాధ్యత. కానీ ప్రతిపక్షాన్ని అణచివేసేలా సభను నడుపుతున్నారు” అని హరీశ్ రావు అన్నారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని, కానీ ప్రస్తుతం అది అధికార పార్టీ అరాచకానికి వేదికగా మారిందని ఆరోపించారు.
అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మాజీ సీఎం కేసీఆర్ మరణాన్ని కోరుకునేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తాయని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని హెచ్చరించారు.
ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ ఎప్పటికీ అంగీకరించదని, సభలోనూ బయటా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
