“నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటి..?” కేటీఆర్ ప్రశ్నల వర్షం
మన భారత్, తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో చదివినందుకు రేవంత్‌రెడ్డికి ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో నాణ్యమైన విద్య లేకుండా చేశారని ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో రైతు రాజ్యం కొనసాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాబందుల రాజ్యం వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు కనిపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి రాజ్యం తీసుకొస్తామని చెప్పారని, కానీ ఇలాంటి పరిస్థితులు చూస్తామని ఊహించలేదని విమర్శించారు.
ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్పంచుల సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని చూసి తనకు కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉందని, కేసీఆర్ మళ్లీ సీఎం అయినట్లుగా భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయమై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో 70 టీఎంసీల సామర్థ్యంతో ఐదు రిజర్వాయర్లు నిర్మించామని, 90 శాతం పనులు పూర్తి చేసి ఒక పంపుకు కూడా బటన్ ఆన్ చేశామని గుర్తు చేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్లలో ఒక్క తట్టెడు మట్టిని కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
తన పాత బాస్‌కు కోపం వస్తుందనే కారణంతోనే రేవంత్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. 1952లో బూర్గుల రామకృష్ణారావు 150 టీఎంసీలతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేశారని, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తోందనే కారణంతోనే పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్‌రెడ్డికి పాలమూరుపై ప్రేమ లేదని, భూములు, రియల్ ఎస్టేట్‌లపైనే ఆసక్తి ఉందని విమర్శించారు. ప్రజల్లో ఆదరణ తగ్గినందుకే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఫలితాలు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని గుర్తు చేశారు.
రెండేళ్లలోనే ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు పట్టం కట్టాలని చూస్తున్నారని, ఆయన పాలనలో ప్రతి పల్లె ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు నిర్లక్ష్యంతో కంప చెట్లు మొలిచి అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
