మోదీ, అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్
మన భారత్, హైదరాబాద్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులను కాపాడుకోవడం కోసం వారు ఎంతకైనా తెగించుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వాటా, కేంద్ర వాటాలను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఒక పెత్తందారీ పార్టీగా మారిందని, పేదల శ్రమను దోచి కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీలకు లాభాలు చేకూరుస్తోందని ఎద్దేవా చేశారు.
బీద వాడి గోడు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదని మండిపడ్డ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఉండటం తమ అదృష్టమని పేర్కొంటూ, సామాజిక న్యాయం, సమానత్వమే పార్టీ ప్రధాన సిద్ధాంతాలని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరును ప్రశంసించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన విజన్‌తో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టారని గుర్తు చేస్తూ, దేశవ్యాప్తంగా జనగణనపై చర్చ తెరపైకి రావడానికి కారణం తెలంగాణలో జరిగిన ఈ ప్రయత్నమేనని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
