మన భారత్, హైదరాబాద్: ఆన్లైన్లో ఫుడ్, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థల గోదాములు, డార్క్ స్టోర్లలో నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన కూరగాయలు, పాడైపోయిన ప్రూట్స్, ఎక్స్పెరీ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా కుళ్లిన ప్రూట్స్, కాలం చెల్లిన ప్యాకెట్ ఫుడ్, సరైన లేబుల్స్ లేకుండా నిల్వ చేసిన వస్తువులు బయటపడ్డాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, హైజిన్ లోపాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తనిఖీల సందర్భంగా మొత్తం 76 కిలోల కుళ్లిన కూరగాయలు, ఎక్స్పెరీ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలను అక్కడికక్కడే పారేయించాలని ఆదేశించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరించినందుకు 32 ఆన్లైన్ డెలివరీ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆన్లైన్లో ఆహార, నిత్యావసరాల కొనుగోలు సమయంలో వినియోగదారులు ఎక్స్పెరీ డేట్, ప్యాకింగ్ తేదీ, నిల్వ పరిస్థితులను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.
