రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మధ్యాహ్నం వరకు ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌కు ఏర్పాట్లు
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 415 స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. రిజర్వేషన్లు, పరిపాలనా కారణాలు, ఇతర సాంకేతిక సమస్యల నేపథ్యంలో 6 గ్రామాల్లో ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు.
దీంతో మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 29,913 వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచే ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే అవసరమైన ఏర్పాట్ల అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. లెక్కింపు పూర్తైన తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఎన్నికలు సజావుగా సాగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు.
