🔴 ఆసిఫాబాద్‌లో ఉద్రిక్తత — మహిళా సర్పంచ్‌పై గొడ్డలితో దాడి ప్రయత్నం
ఆసిఫాబాద్, డిసెంబర్ 12 (మన భారత్): ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరంధోళి గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన దాడి ప్రయత్నం స్థానికంగా సంచలనం రేపింది. తాజాగా సర్పంచ్‌గా గెలుపొందిన రాథోడ్ పుష్పలతపై ఆమె ప్రత్యర్థి దిలీప్ కాటే గొడ్డలితో దాడికి యత్నించిన ఘటన గ్రామాన్ని కలవరపరిచింది.
విజయోత్సవాలతో సందడిగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుష్పలతపై దాడి చేయబోయిన సమయంలో అక్కడే ఉన్న ఆమె మామ ముందుకు వచ్చి అడ్డుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెంటనే స్పందించి పుష్పలతకు రక్షణ అందించారు. దాడిచేసిన వ్యక్తి దిలీప్ కాటేపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వ్యక్తిగత వైరం, రాజకీయ వర్గాల మధ్య ఉద్రిక్తతలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
పరంధోళి గ్రామంలో భద్రతా చర్యలను పెంచిన పోలీసు అధికారులు, ఇకపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన పహారా ఏర్పాటు చేశారు.
