సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం!
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు మంగళవారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎగ్జిట్ 17 సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కొద్దిసేపు ఆందోళన పరిస్థితి నెలకొంది.
అయితే డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి, చాకచక్యంతో వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కాన్వాయ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు వెంటనే చర్యలకు దిగారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్టెప్నీ అమర్చడంతో పాటు తక్షణ అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి కాన్వాయ్‌లో చేరింది.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదే ఏడాది ఏప్రిల్ 8న కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ వాహనం మన్నెగూడ వద్ద టైర్ పేలిన సంఘటన గుర్తు చేసుకునేలా తాజా ఘటన నిలిచింది. వరుసగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కాన్వాయ్ వాహనాల భద్రతా ప్రమాణాలను అధికారులు మళ్లీ సమీక్షించనున్నారు.
