💥చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా: సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి బాండ్ వైరల్!✍️
మన భారత్, తెలంగాణ: కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి రాసిన బాండ్ ఇప్పుడు గ్రామంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ భారీ చర్చకు దారితీసింది. రాజేశ్వరి అనే అభ్యర్థి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే “కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తాను”అని బాండ్‌పై రాసిచ్చారు. ఈ వ్యాఖ్యలు గ్రామ రాజకీయాల్లో కొత్త సందడి రేపాయి.
రాజేశ్వరి తన విజయం సాధించిన వెంటనే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బాండులో పేర్కొన్నారు. ముఖ్యంగా—
🔹 12 పడకల మినీ ఆస్పత్రి
🔹 మినీ ఫంక్షన్ హాల్
🔹 ఓపెన్ జిమ్ ఏర్పాటు
🔹 కోతుల సమస్య పరిష్కారం
అన్ని పనులను మూడేళ్లలో పూర్తి చేస్తానని, చేసి చూపలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే తమ కుల పెద్దల ముందు చెప్పులు మెడలో వేసుకుని తప్పుకుంటానన్న మాట గ్రామస్తుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ బాండ్ గ్రామ రాజకీయాల్లో కొత్త మలుపు మాత్రమే కాదు, ఎన్నికల హామీలపై అభ్యర్థుల నిజాయితీకి ఉదాహరణగా పలువురు మాట్లాడుకుంటున్నారు.
