ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి 40 లక్షలు ఇస్తా: బాల్డ్ యాదగిరి
మన భారత్, రాజాపేట: రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన బాల్డ్ యాదగిరి కీలక ప్రకటన చేశారు. తాను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి ₹40 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తానని ఆయన ప్రకటించారు.
తనకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ ప్రస్తుత సర్పంచ్ నిబంధనలు తనకు అనుకూలంగా ఉండటంతో ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నట్లు యాదగిరి తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల తనకున్న కట్టుబాటు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు తన విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏకగ్రీవానికి సహకరించాలని కోరుతున్నట్లు యాదగిరి చెప్పారు. గ్రామం మొత్తం అభివృద్ధి దిశగా తీసుకోబోయే సంకల్పాలకు ప్రజలు స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
