మూడు నెలలుగా వేతనాలు లేవు… ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్‌లకు తీవ్ర ఇబ్బందులు
మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ సైతం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణం శుభ్రపరిచే బాధ్యతను నిర్వర్తిస్తున్న వీరు దైనందిన ఖర్చులకూ డబ్బుల్లేక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
ఈ నేపథ్యంలో స్కావెంజర్‌ల సమస్యలను యూనియన్ నేతలు వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు దర్శనాల ప్రతాప్ మాట్లాడుతూ, “మూడునెలలుగా వేతనాలు విడుదల చేయకపోవడం అన్యాయం. కుటుంబాలను నడపడానికి కూడా వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రత కోసం కష్టపడే సిబ్బందికి తక్షణమే వేతనాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
స్కావెంజర్‌ల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, ఇకపై ఇలాంటి ఆలస్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు కోరుతున్నారు.
