దంపతులు రోజుకు 5 నిమిషాలు మాట్లాడితే బంధం బలపడుతుంది: నిపుణుల సూచనలు
మన భారత్ , Relationship Health: బిజీ జీవితంలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా సమయం దొరక్కపోవడం చాలామంది కుటుంబాల్లో సాధారణమైపోయింది. అయితే ఇలా మౌనం పాటించడం వల్ల అనవసర అపోహలు, దూరాలు, చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉందని సంబంధ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు రోజుకు కనీసం ఐదు నిమిషాలు అయితేనేం… భార్యాభర్తలు ఒకరి జీవితంలో ఏం జరుగుతోంది, వారి మనసులో ఉన్న భావాలు ఏమిటి, పనిలో వచ్చిన ఒత్తిడి ఏ విధంగా ఉందనే అంశాలను పంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఐదు నిమిషాల ‘టాక్ టైమ్’ వారి బంధాన్ని మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 5 నిమిషాలు మాట్లాడితే కలిగే లాభాలు
✔ అపోహలు దూరం – మాట్లాడకపోవడం వల్ల కలిగే అనుమానాలు, అపోహలు తొలగుతాయి.
✔ మనసు తేలిక– రోజు ఎదుర్కొన్న ఒత్తిడిని పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
✔ సాన్నిహిత్యం పెరుగుతుంది– భావోద్వేగ అనుబంధం బల పడుతుంది.
✔ పరస్పర అవగాహన – ఒకరి భావాలు మరొకరు సులభంగా అర్ధం చేసుకుని అనుకూలంగా స్పందిస్తారు.
✔ చిన్న సమస్యలే అక్కడే పరిష్కారం– పెద్ద గొడవలుగా మారే అవకాశం తగ్గుతుంది.
నిపుణుల మాటల్లో…“జంటలు రోజూ కొద్దిసేపైనా మాట్లాడుకోవడం వారి బంధానికి టానిక్‌లాంటిదే. ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనసులోని మాట చెప్పేందుకు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఐదు నిమిషాలు చాలు” అని సంబంధ నిపుణులు సూచిస్తున్నారు.
కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా, ప్రేమతో కొనసాగించాలంటే ఈ చిన్న అలవాటు పెద్ద మార్పునిస్తుందని వారు చెబుతున్నారు.
