నిజామాబాద్‌లో కిలాడీ లేడీ సంచలనం
స్నేహం నెపంతో ఇంట్లో భారీ చోరీ – సీసీ కెమెరాకు దొంగతనం పూర్తి రికార్డు
మన భారత్, నిజామాబాద్: మంచితనం ముఖం పెట్టుకొని మోసాలకు పాల్పడే ఘటనలు పెరుగుతున్నాయి. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని దోపిడీలకు తెగబడే వారిలో ఇప్పుడు మహిళలు కూడా ముందుంటున్నారు. అలాంటి సంఘటనే నిజామాబాద్‌లో వెలుగుచూసి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఓ మహిళ స్నేహితురాలిగా నమ్మకం కల్పించి ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది.
నిజామాబాద్‌లోని కుమార్ గల్లీలో నివసించే గాయత్రి అలియాస్ గౌతమి బ్యూటీ పార్లర్ పనిచేస్తూ ఆ ఇంటి యజమానితో సన్నిహిత పరిచయం పెంచుకుంది. ఇదే నమ్మకాన్ని ఉపయోగించుకుని గాయత్రి డూప్లికేట్ తాళం తయారు చేయించుకుని తన వద్ద ఉంచుకుంది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో క్రమం తప్పకుండా విలువైన వస్తువులను అపహరిస్తూ వచ్చింది.
తరచూ డబ్బులు, నగలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని గృహంలో స్పై కెమెరాలు అమర్చాడు. చివరకు కిలాడీ లేడీ అసలైన రూపం బయటపడింది. దొంగతనం చేస్తున్న ప్రతి క్షణం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. మొత్తం 18 తులాల బంగారం, 1.30 కిలోల వెండి, అలాగే కొంత నగదు దొంగతనం చేసినట్లు గుర్తించారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గౌతమిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మకాన్ని ముసుగుగా పెట్టుకుని జరిగిన ఈ దొంగతనం ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది.
