ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు: భారీ గృహ ప్రణాళికతో సీఎం చంద్రబాబు
మన భారత్, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ప్రతి అర్హ కుటుంబానికి స్వంత గృహం అందించేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణంపై సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
మూడు సంవత్సరాల్లో మొత్తం 17 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా టిడ్కో మరియు గృహనిర్మాణ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. అర్హుల ఎంపికలో ఆలస్యం జరుగకుండా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
అలాగే గృహ నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన నిధులు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. “ప్రతి కుటుంబం సురక్షిత గృహం కలిగి ఉండాలి… అది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని సీఎం పేర్కొంటున్నారు.
