“సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం” – పెండ్లిమర్రి సభలో సీఎం చంద్రబాబు
మన భారత్, కడప: సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన భారీ ప్రజాసభలో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేసి, వాటిని సూపర్ హిట్గా మార్చామని స్పష్టం చేశారు.
తాను రైతు బిడ్డనని గుర్తుచేసుకున్న చంద్రబాబు, చిన్నప్పటి నుంచి తండ్రికి వ్యవసాయంలో తోడ్పడిన అనుభవం ఉన్నందునే అన్నదాతల కష్టాలు బాగా తెలుసని పేర్కొన్నారు. రైతుల భారం తగ్గించేందుకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఒక్కో రైతుకు ₹14,000 ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలని, సాగు పద్ధతులు ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. రైతుల ఆదాయం పెంచేలా పంచసూత్రాల అమలు వేగవంతం చేస్తున్నామని వివరించారు.
పెండ్లిమర్రి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
