“సత్యసాయి ఇచ్చిన ఆ పుస్తకమే నాకు గోల్డెన్ మూమెంట్” – సచిన్ భావోద్వేగం
మన భారత్, పుట్టపర్తి: సర్వత్ర ప్రేమ, అర్థం చేసుకునే గుణం పెంపొందించాలని సత్యసాయి బాబా ఇచ్చిన సందేశం తన జీవితం మీద గొప్ప ప్రభావం చూపిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. ప్రజలను త్వరగా తీర్పు ఇవ్వకుండా, వారిని అర్థం చేసుకోవడమే సత్యసాయి బోధనలోని గొప్పతనం అని ఆయన పేర్కొన్నారు.
“2011 వరల్డ్ కప్ సమయంలో నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. బెంగళూరులో ఉన్న ఆ రోజుల్లో సత్యసాయి బాబా నాకు ఫోన్ చేశారు. కొద్ది రోజులకు ఆయన ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం నా మనసులో సానుకూలత ను నింపింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే శక్తి మాకు ప్రపంచకప్ గెలుపు వైపు నడిపింది. ఆ క్షణం… ఆ పుస్తకం… నాకు నిజంగా ఒక గోల్డెన్ మూమెంట్” అని సచిన్ గుర్తుచేసుకున్నారు.
పుట్టపర్తిలో జరుగుతున్న సత్య సాయి శత జయంతి వేడుకల సందర్భంలో సచిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భక్తులను, అభిమానులను ఆకట్టుకున్నాయి. సత్యసాయి స్ఫూర్తి జీవితాల్లో ఎలా మార్పు తేగలదో సచిన్ మాటల్లో మరోసారి వెల్లడైంది.
