32 కార్లతో భారీ ఉగ్రదాడి కుట్ర… దర్యాప్తులో వెలుగులోకి సంచలన వివరాలు
మన భారత్ – నేషనల్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది. ఇది సాధారణ ప్రమాదం కాదని, దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి ఉగ్ర దాడులకు నేలవేసే కుట్రలో భాగమని భద్రతా సంస్థలు నిర్ధారించాయి. ఈ కుట్ర వెనుక వైట్‌కాలర్ ఉగ్రవాదుల ముఠా పనిచేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఒకేసారి దేశవ్యాప్తంగా దాడుల ప్రణాళిక.. దర్యాప్తు ప్రకారం, డిసెంబర్ 6న 32 కార్లతో దేశంలోని నాలుగు ప్రధాన నగరాలలో ఏకకాలంలో సీరియల్ బాంబ్ బ్లాస్టులకు అనుమానితులు ప్రణాళిక రూపొందించారు. ఐ20, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్ వంటి పాత కార్లను కొనుగోలు చేసి… వాటిని ప్రత్యేకంగా మాడిఫై చేసి పేలుడు పదార్థాలు నింపేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హర్యానా ఫరీదాబాద్‌లో HR87 U 9988 నెంబర్ గల బ్రెజ్జా కారు..
అదే ప్రాంతంలో DL10 CK 0458 నెంబర్ గల ఎకోస్పోర్ట్ కారు గుర్తింపు
డాక్టర్ల ఫండింగ్ – 26 లక్షల నిధులు..
ఉగ్ర ప్రణాళిక కోసం సుమారు రూ. 26 లక్షలు వైట్‌కాలర్ డాక్టర్ల ద్వారా సమకూరినట్లు విచారణలో తేలింది. ఈ నిధుల సేకరణలో పాల్గొన్న అనుమానితులుగా డాక్టర్ ముజమ్మిల్ గన్నై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షహీన్ సయ్యిద్, డాక్టర్ ఉమర్ నబీలను గుర్తించారు. ఈ మొత్తాన్ని ముఖ్యంగా ఉమర్ నబీ ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించినట్లు భద్రతా సంస్థలు వెల్లడించాయి.
హైదరాబాద్‌లో మరో షాక్ – డాక్టర్ సయ్యద్ ఇంటిపై గుజరాత్ ఏటీఎస్ సోదాలు
ఉగ్రవాద అనుమానాల కేసులో అరెస్టైన హైద్రాబాద్ వైద్యుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ నివాసంలో గుజరాత్ ఏటీఎస్ అర్ధరాత్రి సోదాలు జరిపింది. రాజేంద్రనగర్ ఫోర్త్ వ్యూ కాలనీలోని ఇంటిలో గంటన్నర పాటు సోదాలు జరిపారు.
మూడురకాల లిక్విడ్ సాంపిల్స్,కంప్యూటర్, పలు పుస్తకాలు,ఆయిల్ తయారీ మిషన్,కీలక డాక్యుమెంట్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సయ్యద్ సోదరుడు ఒమర్ ఫారూఖీ మాట్లాడుతూ, మంగళవారం అర్ధరాత్రి సోదాలు జరిగినప్పటికీ… మరోసారి సోదాలు జరుగుతున్నాయన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తమ హోటల్ గెలాక్సీ (పిల్లర్ నంబర్ 122 వద్ద)లో కూడా పోలీసుల తనిఖీలు జరిగినట్టు చెప్పారు.
ఉన్నత విద్యావంతుల పాల్గొనడం ఆందోళనకరం..
వైద్యులు వంటి విద్యావంతులు ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యం కావడం కేంద్ర భద్రతా ఏజెన్సీలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణను మరింత విస్తరిస్తున్నారు.
#TerrorPlot #DelhiBlast #NationalSecurity #IndiaNews #ManaBharath.Com
