రేపు భారీ ప్రకటన: ఏపీకి మరో మెగా ఇన్వెస్ట్‌మెంట్ రాబోతోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్
మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు భారీ పెట్టుబడి ప్రకటన చేయనున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు.
‘2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసింది. కానీ ఇప్పుడు తుఫాను మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోంది. రేపు ఉదయం 9 గంటలకు పెద్ద అనౌన్స్‌మెంట్ ఉంటుంది. రెడీగా ఉండండి’ అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణం నెలకొన్నందున పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీపై దృష్టి సారిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇక ఢిల్లీలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేశ్,
‘ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది. ఒకటి కేంద్రం, మరొకటి రాష్ట్రం. అందుకే ఇన్వెస్టర్లు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, ప్రోత్సాహక ప్యాకేజీలతో ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు వెలువడబోయే ప్రకటనపై పరిశ్రమల వర్గాలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
