ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటన అంతర్‌రాష్ట్ర రహదారి పరిశీలనలో ప్రమాద స్థలాల గుర్తింపు
మన భారత్, తాంసి, నవంబర్ 11: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ రూరల్, తాంసి, తలమడుగు మండలాల మీదుగా వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై పర్యటించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని రాంపూర్,తాంసి మండలంలోని పొన్నారి, హస్నాపూర్, అలాగే లక్ష్మీపూర్ (తలమడుగు మండలం) గ్రామాల పరిధిలో గతంలో చోటుచేసుకున్న ప్రమాద స్థలాలను స్వయంగా పరిశీలించారు. ప్రతి ప్రమాద స్పాట్‌లో రోడ్డు నిర్మాణ లోపాలు, మలుపులు, దృశ్యమానత సమస్యలను గుర్తించారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రమాదాలు తగ్గించేందుకు త్వరలోనే స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ రేడియం బోర్డులు, ప్రమాద హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నాం,” అని తెలిపారు.
అలాగే వాహనదారులు వేగాన్ని నియంత్రించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.
పర్యటన అనంతరం పొన్నారి గ్రామ ప్రజలు ఎస్పీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫనిధర్, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, తహసీల్దార్ లక్ష్మీ, మాజీ వైస్ ఎంపీపీ రఘు, మాజీ సర్పంచ్ అండె అశోక్, కేమ లక్ష్మణ్ ,రమణ, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.
