🐆చిరుత భయం.. మెడ చుట్టూ ఇనుప కంచె! మహారాష్ట్ర ప్రజల వినూత్న రక్షణ యత్నం
మన భారత్, ముంబై, నవంబర్ 11: మహారాష్ట్రలోని పింపర్ ఖేడ్ ప్రాంతంలో చిరుత పులి భయాందోళన సృష్టిస్తోంది. గత కొన్ని వారాలుగా చిరుత దాడులు పెరిగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో, గ్రామస్థులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని ఆలోచించారు.
సాధారణంగా చిరుతలు మెడపై దాడి చేస్తాయని అంచనా వేసిన గ్రామస్థులు, తమ మెడ చుట్టూ ఇనుప ముళ్ల కంచెలు (iron spike collars) ధరించడం ప్రారంభించారు. ఇవి చిరుత దాడిని అడ్డుకుంటాయని, తమకు రక్షణగా ఉంటాయని వారు నమ్ముతున్నారు.
ఇక మనుషులే కాదు, గ్రామంలోని పశువులు, శునకాలు కూడా ఈ ముళ్ల కంచెలతోనే సంచరిస్తున్నాయి. పొలాలకు లేదా అడవికి పనుల నిమిత్తం వెళ్లే సమయంలో ప్రజలు తప్పనిసరిగా ఈ రక్షణ కంచెలను ధరిస్తున్నారు.
అడవి శాఖ అధికారులు ఇప్పటికే చిరుతను పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, ఇంకా దాని తాటికి ఎవరూ చేరలేకపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది.
