ధాన్యం సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోండి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన
మన భారత్, మెదక్ జిల్లా : రానున్న మూడు రోజుల్లో మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు మరియు ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ— వర్షాల ప్రభావం వల్ల ధాన్యం తడవకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ..“కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయాలి. తడవకుండా కవర్లతో కప్పి ఉంచాలి. వర్షాల సమయంలో రైతులు తమ ధాన్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. వర్షపు నీరు ధాన్యానికి తగలకుండా నీరు వెళ్లిపోయే విధంగా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి,” అని సూచించారు.
అలాగే, సంబంధిత వ్యవసాయ, సివిల్ సప్లైస్, రెవిన్యూ శాఖ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తప్పించుకోవచ్చని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
