పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు రూ.1,032 కోట్ల విడుదల — ఉద్యోగుల బకాయిలకు రూ.712 కోట్లు ప్రత్యేక కేటాయింపు
మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ శుక్రవారం నాడు రూ.1,032 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల పరిష్కారానికి మాత్రమే రూ.712 కోట్లు కేటాయించబడగా, మిగిలిన రూ.320 కోట్లు పంచాయతీ రాజ్, రోడ్లు మరియు భవనాల శాఖలకు చెందిన బిల్లుల కోసం కేటాయించబడ్డాయి.
ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో విడుదలైన ఈ నిధులు, ఉద్యోగుల వైద్య ఖర్చులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మరియు ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపులకు వినియోగించబడతాయి. రాష్ట్ర మంత్రివర్గం గత జూన్ నెలలో ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేస్తూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను దశల వారీగా తీర్చాలనే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.712 కోట్ల నిధులను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది.
ఇక రూ.10 లక్షల లోపు విలువ కలిగిన పబ్లిక్ వర్క్స్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పంచాయతీరాజ్, రోడ్లు మరియు భవనాల శాఖలకు చెందిన 46,956 బిల్లులకు రూ.320 కోట్లు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వీటిలో రోడ్లు, భవనాల శాఖ బిల్లులకు రూ.95 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ స్థానిక సంస్థల బిల్లులకు రూ.225 కోట్లు కేటాయించబడ్డాయి.
భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలం నుండి పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తున్నామని, దశలవారీగా అన్ని బకాయిలను చెల్లించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
