మన భారత్,మెదక్ జిల్లా , నర్సాపూర్ : కార్తీక కే పౌర్ణమి సందర్భంగా నర్సాపూర్ పట్టణం భక్తి భావంతో నిండిపోయింది. బస్టాండ్ ఆవరణలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజు విశేష పూజలు, ఆరాధనలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పూజ, గణపతి పూజ, శివాభిషేకం విశేషంగా జరిగాయి. అనంతరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి సింధూర లేపనం, “శ్రీరామ జయరామ జయ జయ రామ” నామంతో తమలపాకుల హారం, జిల్లెడు పూల హారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాలుపంచుకున్నారు.
అదే సందర్భంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, అయ్యప్ప భజన కార్యక్రమం ఉత్సాహంగా సాగాయి. ఆలయ ప్రాంగణంలో గోపాల రెడ్డి, అయ్యప్ప గురుస్వామి, రమేష్, సదానందం తదితర భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తీర్థప్రసాదం పంపిణీ జరిపారు.
ఆలయ నిర్వాహకులు చెల్మిటి సంజీవ, జ్ఞానేశ్వర్ నాయుడు, రమేష్, గోపాల్, సదానందం, అయ్యప్ప గురుస్వామి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “కార్తీక పౌర్ణమి రోజున భక్తి కార్యక్రమాలు నిర్వహించడం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది” అన్నారు.
నర్సాపూర్ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయి భక్తిరసమయంగా మారింది.
