ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతపై బిడెకన్నెలో అవగాహన. కృషి సఖి శిక్షణా కార్యక్రమం ముగింపు
మన భారత్, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం : సేంద్రియ వ్యవసాయం, ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య రైతులకు, మహిళలకు పిలుపునిచ్చారు. ఝరాసంగం మండలంలోని బిడెకన్నె గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ మరియు లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషి సఖి శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది.
ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ..“భవిష్యత్తు తరాలకు భద్రత కల్పించాలంటే సేంద్రియ పద్ధతిలో పంటల సాగు తప్పనిసరి. పర్యావరణానికి అనుకూలంగా, మన ఆరోగ్యానికి మేలు చేసే పంటల వైపు రైతులు మళ్లాలి. మన తాతల కాలంలో సాగు చేసిన ప్రాచీన పంటలు ఇప్పుడు మరుగున పడిపోతున్నాయి. ఆ సంప్రదాయ పంటలను పునరుద్ధరించేందుకు మహిళలు ముందుండాలి” అని సూచించారు.
సహజ వ్యవసాయం ద్వారా నేలలో జీవసత్వం పెరుగుతుందని, నీటి వినియోగం తగ్గుతుందని, రైతులకు దీర్ఘకాల లాభాలు చేకూరుతాయని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన కృషి సఖి మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, కృషి సఖి మహిళలు, అరణ్య సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
