“అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే” – సీఎం రేవంత్‌పై కవిత సెటైర్
జాగృతి జనం బాటలో ఆవేశభరిత ప్రసంగం – సామాజిక తెలంగాణ సాధనకు కవిత పిలుపు
మన భారత్, మహబూబ్‌నగర్:
భౌగోళిక తెలంగాణను సాధించినా, సామాజిక తెలంగాణ ఇంకా దూరంలోనే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూస్తే, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవాల్సిందే” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో జాగృతి చేపట్టిన ‘జనం బాట’ పాదయాత్రలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ – “సామాన్యులకు కనీస వైద్యం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు చదువులు వదిలి ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది” అని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయకపోతే, ఆ నీటిని పొరుగు రాష్ట్రం తరలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపును అడ్డుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని కవిత స్పష్టం చేశారు.
సామాజిక తెలంగాణ అవసరం కవిత మాట్లాడుతూ – “భౌగోళిక తెలంగాణ సాధించినా, సామాజిక తెలంగాణ సాధనలో మాత్రం ఇంకా వెనుకబడ్డాం. ఇది సాధించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు రావాలి. ఆత్మగౌరవం కలిగిన అధికారం కావాలి” అని పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ఆసుపత్రులు, గురుకులాలను కూడా సరిగ్గా నడపలేకపోతుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరమని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి చర్చించాలని కవిత డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు న్యాయం కావాలి..రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని, పత్తి, వడ్లు, ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
జాగృతి లక్ష్యం – ఎంబీసీ స్వశక్తికరణ
“నా రాజకీయాలు కాదు, ప్రజా సేవే నా ధ్యేయం. నాకు ప్రస్తుతం బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఎంబీసీ కులాల స్వశక్తికరణే తెలంగాణ జాగృతి లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జాగృతి సంస్థ మరోసారి ప్రజా సమస్యల పరిష్కారానికి ‘జనం బాట’ పేరుతో పోరాట బాట పట్టింది. అక్టోబర్ 26న గన్‌పార్క్‌లో అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం నిజామాబాద్ నుంచి కవిత తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 33 జిల్లాల్లోని 119 నియోజకవర్గాలను ఈ పాదయాత్ర కవర్ చేయనుంది.
