తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
మన భారత్, హైదరాబాద్ : మొంథా తుఫాన్ తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరాలు, గ్రామాలు, రహదారులు అన్నీ నీట మునిగిపోయి రాష్ట్రం మొత్తం తడిసి ముద్దయింది. వర్షాల తీవ్రత పెరగడంతో వాతావరణశాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు గురువారం హాలిడేగా ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భద్రతా చర్యలు పాటించాలని కలెక్టర్లు సూచించారు. తుఫాన్ ప్రభావంతో వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వర్షపు నీటితో రహదారి చెరువుగా మారిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివనగర్, మైసయ్యనగర్, కాశీబుగ్గ, విశ్వనాథ్ కాలనీ, స్టేషన్ రోడ్, బట్టలబజార్ వంటి ప్రాంతాలు నీటమునిగాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద కూడా వరద నీరు నిలిచిపోయింది. బస్టాండ్ వద్ద ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రజల సహాయక చర్యల కోసం హనుమకొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానికులు 79819 75495 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని అధికారులు సూచించారు. వర్షాల తీవ్రత మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
