మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో నేడు నెలకొన్న ప్రశాంత వాతావరణం వెనుక అమర వీరుల త్యాగమే ఉన్నదని రూరల్ సి.ఐ ఫణిదర్ పేర్కొన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా బుధవారం తాంసి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ ఫణిదర్ మాట్లాడుతూ ..ప్రజల రక్షణ కోసం, దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగం ఎప్పటికీ మరువరాదన్నారు. “వారి త్యాగ ఫలితమే మనం నేడు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నాం” అని పేర్కొన్నారు. పోలీసు వృత్తి కేవలం ఉద్యోగం కాకుండా ప్రజాహితమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న పోలీసులు “అమర వీరుల జోహార్” అంటూ నినాదాలు చేస్తూ వీర స్ఫూర్తిని గుర్తు చేశారు. స్థానిక యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరుల త్యాగాలకు నివాళులు అర్పించారు. సంఘటనా స్థలంలో తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
–✍️ మన భారత్, ఆదిలాబాద్
