మెదక్ జిల్లా కౌడిపల్లి-కొల్చారం రోడ్డుపై ఆర్టీసీ బస్సు ఢీ ..15 గొర్రెలు మృతి, మరికొన్నికి తీవ్ర గాయాలు
మెదక్, అక్టోబర్ 27: మెదక్ జిల్లా కౌడిపల్లి–కొల్చారం మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుండి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదం తీవ్రతతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గొర్రెల మృతదేహాలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్ గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కౌడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. గాయపడిన గొర్రెలను సమీపంలోని పశువైద్య ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపించారు. తన పశువులు చనిపోయిన దృశ్యం చూసి గొర్రెల యజమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. “అవే మా జీవనాధారం, అన్నీ పోయాయి” అంటూ బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
– మన భారత్, మెదక్ ప్రతినిధి
