తాంసి పోలీసుల సైకిల్ ర్యాలీతో అమరవీరుల వారోత్సవాలు
మన భారత్, ఆదిలాబాద్: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంలో తాంసి మండల కేంద్రంలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఎస్సై జీవన్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ ర్యాలీ ప్రభుత్వ వైద్యశాల వద్ద ప్రారంభమై అంబేద్కర్ చౌక్ మీదుగా పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది.
రాజకీయ, సామాజిక నాయకులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీ గ్రామంలో దేశభక్తి గీతాలతో సందడి చేసింది. ప్రజల్లో పోలీసు సేవలపై అవగాహన కల్పించడం, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఈ ర్యాలీ ముఖ్యోద్దేశమని ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ, “దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ప్రతి ఒక్కరూ గౌరవంగా స్మరించాలి” అని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఉత్తమ్, పోలీసు సిబ్బంది, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రహదారులపై పోలీసుల నినాదాలు, యువత ఉత్సాహం తాంసి పట్టణానికి కొత్త చైతన్యం తెచ్చాయి.
