మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం — పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం
మన భారత్, మహబూబ్‌నగర్: దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల స్మరణార్థం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్ అధికారి (ఎస్పీ) డి. జానకి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదాతలను అభినందిస్తూ, “పోలీసులు దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం సేవలందించిన అమరవీరుల త్యాగం స్మరణీయమైంది” అని పేర్కొన్నారు.
శిబిరంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది, అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడడం ఒక గొప్ప మానవతా సేవ అని ఎస్పీ డి. జానకి అన్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం సమాజ సేవకు నిదర్శనంగా నిలిచింది. ప్రజల ప్రాణ రక్షణలో మాత్రమే కాకుండా, మానవతా కార్యక్రమాల్లో కూడా పోలీసులు ముందుంటారని జిల్లా పోలీసులు తెలిపారు.
