రాష్ట్రవ్యాప్తంగా రవాణా చెక్‌పోస్టుల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
తక్షణ అమలుకు రవాణా కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన సూచనలు
మన భారత్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ వెంటనే చర్యలు ప్రారంభించి, అన్ని జిల్లా రవాణా అధికారులకు (డీటీఓలు) స్పష్టమైన సూచనలు పంపించారు.
కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం, జిల్లా రవాణా అధికారులు స్వయంగా చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. అలాగే, చెక్ పోస్టులు మూసివేయబడ్డాయని తెలిపే కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చెక్కింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బందిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, చెక్‌పోస్టు ప్రాంతాల్లో ఎవరూ విధుల్లో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి వీడియో రూపంలో రికార్డు చేసి భద్రపరచాలని కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
చెక్కింగ్ సెంటర్ల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, కంప్యూటర్లు, పరికరాలు మరియు ఇతర సామగ్రిని వెంటనే సంబంధిత డీటీవో కార్యాలయాలకు తరలించాలని సూచించారు. పరిపాలనా రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లు వంటి పత్రాలు సురక్షితంగా భద్రపరచాలని తెలిపారు.
అంతేకాకుండా, చెక్ పోస్టులు నిర్వహించబడిన ప్రాంతాల్లో వాహన రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు చెక్‌పోస్టుల మూసివేత, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, రికార్డు భద్రతపై పూర్తి నివేదిక సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాహనదారులకు సులభ రవాణా సదుపాయాలు అందించడంతో పాటు పరిపాలన సౌకర్యం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
