ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటనకు సర్వం సిద్ధం
పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి భారీగా తరలిరావాలి: రంగినేని శ్రీనివాస్ రావు
మన భారత్, మందమర్రి:
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూన్ 15న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకుడు రంగినేని శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయడం, పార్టీని గ్రామ స్థాయిలో మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఈ పర్యటన చేపడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై కూడా ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
పర్యటనలో భాగంగా ఉదయం 7 గంటలకు కాసిపేట మైన్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గని కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చించనున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని అందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అనంతరం ఉదయం 10 గంటలకు మంచిర్యాలలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఉదయం 11 గంటలకు బెల్లంపల్లిలో నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె కీలక సందేశం ఇవ్వనున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం 12 గంటలకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయం ప్రారంభం పార్టీ సంస్థాగత బలోపేతానికి దోహదపడుతుందని నాయకులు పేర్కొంటున్నారు.
అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమం, గిరిజన హక్కుల పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా స్వామి ఆశీస్సులు పొందనున్నారు. ఈ కార్యక్రమానికి గిరిజన నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
సాయంత్రం 4:30 గంటలకు లక్షెట్టిపేటలో నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఆమె ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ముగియనుంది.
కల్వకుంట్ల కవిత పర్యటన పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, కార్యకర్తల్లో నూతన జోష్ నింపుతుందని రంగినేని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ పర్యటనతో జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత ఊతం లభిస్తుందని, ప్రజలతో పార్టీ అనుబంధం మరింత బలపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
