మన భారత్, యాదాద్రి: దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను హరించే విధానాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సిఐటియు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) మండల నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. సభకు అధ్యక్షత వహించిన బందెల పోచయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం కార్మికుల 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచడం, సమ్మె హక్కు, యూనియన్ ఏర్పాటు చేసే హక్కులను పరిమితం చేయడం వంటి నిర్ణయాలు కార్మిక వ్యతిరేకమని ఆయన విమర్శించారు.ప్రధాన అతిథిగా పాల్గొన్న సిఐటియు యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరి ఆంజనేయులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ లాభాల కోసం కొత్త కోడ్స్ తీసుకురావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేపట్టాలని, దిశానిర్దేశక కార్యక్రమాలు రూపొందించనున్నట్లు నేతలు తెలిపారు. మోటకొండూర్ మండలంలోని గ్రామపంచాయతీ హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బంది, వీబికే ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది, స్లీపర్స్ కార్మికులు తదితర రంగాలకు చెందిన కార్మికులు తమ సమస్యలను సమావేశంలో వివరించారు. ఈ మహాసభలో మోటకొండూర్ మండల కన్వీనర్ వడ్డేబోయిన మహేందర్, గోసంగి పరమేశ్వర్, గంధ మల్ల నరసింహ, మామిడాల మల్లయ్య, చీరాల ఉపేందర్, సిహెచ్. రోమన్, అమ్మనబోలు స్వామి, వంగపల్లి స్వామి, వేముల విట్టల్, రాంపల్లి కిషన్, ఎర్రబెల్లి మల్లేష్, చంద్రకళ, యాదమ్మ, బొట్ల మైసయ్య, లక్ష్మీ నరసింహ, అరుణ, ఎల్లమ్మ, యాదగిరి, రమేష్, అంజయ్య, సత్తయ్య, సురేష్, తిరుమల్, బాబు, కనకయ్య, శ్రీనివాస్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
