78 ఏళ్ల స్వాతంత్ర్యానికీ రోడ్డు లింక్ లేని 40,547 గ్రామాలు
PMGSY కింద 2029 నాటికి పూర్తి కనెక్టివిటీ లక్ష్యం
మన భారత్, న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంకా 40,547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 9,246 ఉన్నాయి. ఆ తర్వాత జార్ఖండ్‌లో 2,787, పశ్చిమ బెంగాల్‌లో 2,748, ఛత్తీస్‌గఢ్‌లో 2,692, జమ్మూకాశ్మీర్‌లో 2,262, గుజరాత్‌లో 2,443 గ్రామాలు రోడ్డు లింక్ లేకుండా ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 413, తెలంగాణలో 173 గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద మిగిలిన అన్ని గ్రామాలకు రోడ్డు లింకేజ్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. 2029 నాటికి రోడ్డు సదుపాయం లేని గ్రామాలన్నింటికీ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా పనులు చేపడతామని కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది.
రోడ్డు కనెక్టివిటీ ద్వారా విద్య, వైద్యం, మార్కెట్ అవకాశాలు, ఉపాధి రంగాలు విస్తరిస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. గ్రామీణ భారతానికి సమగ్ర అభివృద్ధి సాధించాలంటే మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరమని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
