అప్పుల బారినపడి యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: ఆర్థిక ఇబ్బందులు ఒక యువకుడి ప్రాణం తీశాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పటానికి చెందిన మొగ్గులుపల్లి రాములు యాదవ్ (26) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో అప్పుల విషయమై చర్చించి గదిలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అతను ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని నర్సాపూర్ పోలీసులు తెలిపారు.
గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అప్పుల బారిన పడిన రైతులు, యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం సహాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
