కార్తీకమాసంలో దర్శనమాత్రాన మోక్షప్రాప్తి కలిగించే పవిత్ర క్షేత్రం
మన భారత్, శ్రీశైలం: కార్తీకమాసం దేవాలయాల సౌందర్యం, దీపాల వెలుగులు, భక్తి కాంతులు నిండిన పవిత్ర మాసం. ఈ మాసంలో ఒక్కసారి దర్శించినా మోక్షం ప్రసాదించే క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండో జ్యోతిర్లింగమైన శ్రీ మల్లికార్జున స్వామి, శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే శ్రీశైలం “భువిలో వెలసిన కైలాసం”గా ఖ్యాతి పొందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో వెలసిన శ్రీశైలం శివభక్తులకు మోక్షధామంగా నిలిచింది. భక్తుల విశ్వాసం ప్రకారం, శ్రీశైల దర్శనం గంగా నదిలో రెండువేల సార్లు స్నానం చేసిన పుణ్యం, కాశీలో లక్ష సంవత్సరాలు నివసించిన ఫలితం అందిస్తుంది. పురాణాల ప్రకారం, గాయత్రీ మంత్రం జపంతో వరప్రాప్తి పొందిన అరుణాసురుడు, దురహంకారంతో దేవతలను వేధించాడు. దేవతల ప్రార్థనతో ఆదిశక్తి భ్రమర రూపంలో అవతరించి, అరుణాసురుని సంహరించింది. అందుచేత అమ్మవారిని భ్రమరాంబికగా పూజిస్తారు. మల్లికాపుర మహారాజు చంద్రకేతుని కుమార్తె చంద్రమతి తండ్రి కామవశుడై ఆమెను వెంటాడిన సందర్భంలో, ఆమె శివుణ్ణి మల్లెపూలతో పూజించి రక్షణ కోరింది. ఆమె మొర ఆలకించిన శివుడు చంద్రకేతుని ఆకుపచ్చ శిలగా మార్చి పాతాళగంగలో నెట్టేశాడు. ఆ శిల వల్లే పాతాళగంగ నీరు పచ్చగా కనిపిస్తుందని నమ్మకం. అప్పటి నుంచి శివుడు మల్లెపూల ఆర్జునుడిగా — “మల్లిఖార్జునుడు”గా ప్రసిద్ధి చెందాడు. శ్రీశైల మల్లికార్జున దేవాలయం నాలుగు మండపములతో, శిల్పకళా వైభవంతో అద్భుతంగా నిండిన ఆలయం. ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారి ఆలయ గర్భగృహం వెనుక భాగంలో చెవి ఆన్చితే భ్రమర నాదం వినిపించడం ఇక్కడి ప్రత్యేకత. సాక్షి గణపతి ఆలయం: శ్రీశైలానికి వచ్చిన ప్రతి భక్తుడి యాత్రకు సాక్ష్యమిచ్చే గణపతి. పంచ పాండవాల ఆలయాలు: పాండవులు ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ప్రధాన ఆలయ వెనుక ఉన్నాయి. వృద్ధ మల్లికార్జున లింగం: ముడతలతో మానవ ముఖం పోలికలో కనిపించే లింగం. మనోహర గుండం: స్వచ్ఛజలంతో నిండిన పవిత్ర గుండం. పాతాళగంగ: పచ్చగా కనిపించే పవిత్ర నీరు, సూర్యకాంతి ప్రతిబింబంలో నాచు పచ్చగా మెరిసిపోతుంది. హటకేశ్వరం: శ్రీశైలం నుంచి 3 కిమీ దూరంలో ఉన్న శివక్షేత్రం. ఇష్టకామేశ్వరి ఆలయం: నల్లమలలో అత్యంత రహస్యమైన, మహిమాన్వితమైన దేవి ఆలయం. శ్రీశైలం ఆలయ శిఖరాన్ని దర్శించటం ద్వారా పునర్జన్మ ఉండదని, జన్మరాహిత్యం లభిస్తుందని శాస్త్రవచనం చెబుతుంది. ప్రతిరోజూ శ్రీశైలంలో త్రికాల పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి సాయంత్రం జరిగే శివపార్వతుల కళ్యాణం ఇక్కడి విశిష్టత. కార్తికమాసం, మహాశివరాత్రి, శరన్నవరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుతుంది.భక్తి విశ్వాసం..కార్తికమాసంలో శ్రీశైల దర్శనం చేస్తే జన్మజన్మాంతర పాపాలు కరిగిపోతాయని, కేవలం స్మరణతోనే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
–మన భారత్ ప్రత్యేక ప్రతినిధి, శ్రీశైలం
