మైలార్ దేవ్ పల్లి వద్ద దారుణ హత్య ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు
మన భారత్, రంగారెడ్డి జిల్లా:
రూ.1000 రూపాయల కోసం ప్రారంభమైన తగువు చివరకు ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసుల వివరాల ప్రకారం .. వట్టేపల్లిలో నివసించే సయ్యద్ అఫ్రోజ్ (21) అనే యువకుడు కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడు అబ్బు వద్ద నుండి రూ.1000 తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వడంపై ఇటీవల ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ చిన్న వివాదం క్రమంగా తీవ్రతరమై, చివరకు అఫ్రోజ్‌ను హత్య చేయాలనే దురుద్దేశంతో అబ్బు తన స్నేహితులు సోహెల్, రిజ్వాన్ లను కలుపుకొని పథకం రూపొందించాడు. ప్రణాళిక ప్రకారం రాత్రి సమయంలో ముగ్గురు అఫ్రోజ్ ఇంటికి వెళ్లి కత్తులతో అతడిపై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిన అఫ్రోజ్‌ను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ దారుణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఒక్క రూ.1000 కోసం ప్రాణం తీసే స్థాయికి స్నేహితులు దిగజారటం మానవత్వానికి అవమానం” అని అన్నారు. పోలీసులు నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
