కర్నూలు బస్సు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు
- మన భారత్, కర్నూలు: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా, మరికొందరు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తులలో ఒకరి వివరాలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. హైదరాబాదులోని ఆరాంఘర్ వద్ద బస్సు ఎక్కిన ఈ వ్యక్తి పేరు, చిరునామా తెలియకపోవడంతో పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉన్నవారు వెంటనే 08518-277305 నంబర్‌కు సంప్రదించాలని కర్నూలు పోలీసులు ప్రజలను కోరారు.
మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు శనివారం ఉదయం నుంచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. అనుమతులు లేని బస్సులు, సాంకేతిక లోపాలు ఉన్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రైవేట్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ తరహా ఘటనలకు కారణమని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు కూడా సర్టిఫైడ్ ట్రావెల్స్ సేవలనే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
కర్నూలు ప్రమాదం మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
