manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 12:48 pm Editor : manabharath

ఆశా కార్యకర్తల హామీలు వెంటనే అమలు చేయాలి..

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

మన భారత్, నాగర్‌కర్నూల్:
ఆశా కార్యకర్తలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్–సీఐటీయూ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం రూ.18 వేల అమలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ పారితోషికాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లతో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తల సమ్మె శిబిరాలకు వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తే అక్రమ అరెస్టులు చేస్తూ ఆశా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు తరలించడం దారుణమన్నారు.

ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతి నెల ఐదో తేదీ లోపు పారితోషికాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉంచుతోందని తెలిపారు. ఆశా కార్యకర్తలు గ్రామీణ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి కనీస భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు.

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశా కార్యకర్తల్లో అనేక మంది మరణించినా వారికి ఇవ్వాల్సిన బీమా సదుపాయాలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. పైస్థాయి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం, కిందిస్థాయి ఉద్యోగులైన ఆశాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నా జీవిత బీమా లేకపోవడం దారుణమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం, గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమానత్వ సమాజం గురించి మాట్లాడుతున్నప్పటికీ ఉద్యోగులు, కార్మికుల వేతనాల విషయంలో తీవ్ర అసమానతలు కొనసాగుతున్నాయని విమర్శించారు.

“ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని పరిష్కరించాలి. కానీ ప్రస్తుతం ఆశా కార్యకర్తల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతాం” అని ఆర్ శ్రీనివాసులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, కృష్ణవేణి, సువర్ణ, చంద్రకళ, శిరీష, వరలక్ష్మి, విజయనీల, అమీనా, భాగ్యమ్మ, వెంకటమ్మ, మంజుల, గౌరమ్మ తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..