manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 1:43 am Editor : manabharath

తృటిలో తప్పిన ప్రమాదం..

ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లతో భయాందోళన

అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికుల డిమాండ్

మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ఇంటి పైనుగా వెళ్తున్న 33/11 కేవీ విద్యుత్ వైర్లు గాలుల తీవ్రతతో ఒకదానికొకటి తాకి షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎగిసి ఇంటి పైకప్పుపై పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన కాలనీవాసులు వెంటనే ఇంటి యజమాని గొంటిముక్కుల గోపికి సమాచారం అందించగా, స్థానికుల సహకారంతో మంటలు వ్యాపించకముందే నిప్పురవ్వలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై స్పందించిన సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు గొంటిముక్కుల గోపి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 నుండి 20 ఇండ్లపై విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వెళ్తున్నాయని, పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతి వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్లు జరుగుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టీన్ షెడ్లపై నిప్పురవ్వలు పడటంతో పాటు ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ఈసారి కూడా స్థానికులు వెంటనే స్పందించి సమాచారం ఇవ్వకపోతే ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యేదని గోపి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్ల కారణంగా ఇళ్లు నిర్మించుకోవడానికే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాప్రతినిధులు వచ్చి హామీలు ఇస్తున్నారని, కానీ సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

స్థానికులు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయని, అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోడ్డు పక్కగా వైర్లను మార్చి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చిన్నపిల్లలు ఎక్కువగా సంచరిస్తుంటారని, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ వైర్లను సురక్షిత ప్రాంతానికి మార్చాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..