manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 10:38 am Editor : Editor Vishal Kumar

క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ: మంత్రి

మన భారత్, విజయనగరం:
క్రెడిట్ చోరీ రాజకీయాలకు వైసీపీ నాయకులు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మూలపేట పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను తామే నిర్మించామని చెప్పుకోవడం వైసీపీ నేతల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఆదివారం గజపతినగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మానాపురం బ్రిడ్జి మంజూరైందని, అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదని విమర్శించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు.

అలాగే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సరైన రహదారి సౌకర్యం లేని భోజరాజపురం, పి.లింగాలవలస, పాపయ్యవలస గ్రామాలకు కూటమి ప్రభుత్వమే రహదారి సౌకర్యం కల్పించిందన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో రహదారులు నిర్మించి ప్రజలకు మౌలిక వసతులు అందించామని మంత్రి వివరించారు.

డ్రింకింగ్ వాటర్ సమస్యలను పట్టించుకోని వైసీపీ

దత్తిరాజేరు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.8 కోట్లతో పలు తాగునీటి సమస్యలను పరిష్కరించామని, అదనంగా రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు.

వైసీపీ పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల ముందుకు నిజమైన అభివృద్ధి పనులను తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

అన్నా క్యాంటీన్లకు విశేష ఆదరణ

గజపతినగరం ప్రాంతంలో అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి తెలిపారు. రోజుకు సుమారు 800 మందికి కేవలం రూ.5కే భోజనం అందించడం ద్వారా పేదలకు ఉపశమనం కలిగిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకలి తీర్చడంలో అన్నా క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

నియోజకవర్గంలో గత రెండేళ్లలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి వివరించారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల విషయంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపుతున్న మార్గంలో నడవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. చెత్త నిర్వహణ, పారిశుధ్యం విషయంలో ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రెండేళ్లలో రూ.1300 కోట్లతో లక్ష టన్నుల చెత్తను ప్రాసెస్ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. అధికారులు మాత్రమే కాదు ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే అభివృద్ధిలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

ఇటీవల మంత్రుల సింగపూర్ పర్యటనలో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా పారిశుధ్య బాధ్యతలు నిర్వహిస్తున్న తీరును గమనించామని, అదే విధంగా ఇక్కడ కూడా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిశుభ్ర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి స్పష్టం చేశారు.

మీ  చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..