పీవీటీజీ గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం
– ఐటీడీఏ పీఓ మంద మకరందు
మన భారత్, ఉట్నూర్ :
ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరందు తెలిపారు. ఉట్నూరులోని కేబీ ప్రాంగణ సమావేశ మందిరంలో గురువారం ఆదివాసీ తోటి, కొలం సర్పంచులు, వార్డు సభ్యులు, మేధావులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక వసతుల రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ముఖ్యంగా పీవీటీజీ (ప్రత్యేకంగా బలహీన గిరిజన వర్గాలు) కుటుంబాల సమస్యలను గుర్తించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆదివాసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్థాయిలో మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గిరిజనుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు తరచుగా నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్య సేవల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదివాసీ యువత విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి పథకాల అమలు వంటి అంశాల్లో ఐటీడీఏ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న సర్పంచులు, వార్డు సభ్యులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను పీఓ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివాసీల సంక్షేమం కోసం ఐటీడీఏ అన్ని విధాలా అండగా ఉంటుందని పీఓ మంద మకరందు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పలువురు గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
